సాక్షి, న్యూఢిల్లీ : బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి 'ఫాస్ట్ ఫుడ్స్'ను ఆశ్రయిస్తుంటాం, జంక్ ఫుడ్‌ను తింటుంటాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయని, వాటి వల్ల మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తి అంతరించడంతోపాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులు వస్తాయని, సంతాన సాఫల్య లోపం ఏర్పడుతుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని 'సైలెంట్ స్ప్రింగ్ ఇనిస్టిట్యూట్'కు చెందిన శాస్త్రవేత్తలు మనం బయట తినే జంక్ ఫుడ్‌లపై అధ్యయనం చేశారు.
బయట దొరికే ఫుడ్‌లో కల్తీ నూనెలు ఉంటాయని, శుచీ శుభ్రం ఉండదని, అందుకని అవి ప్రమాదకరమని ఇంతకుముందు ఎంతో మంది పరిశోధకులు చెబుతూ వచ్చారు. తాజా అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి. 'పీఎఫ్‌ఏఎస్'గా వ్యవహరించే మానవ తయారీ రసాయనాలు ఈ ఫాస్ట్ ఫుడ్‌లలో ఉన్నట్లు తేలింది. ప్యాకేజీల ద్వారా ఆహార పదార్థాల్లోకి ఇవి వస్తున్నాయని, అలాగే ఒవెన్‌లో తయారు చేసే పాప్ కార్న్‌లో కూడా ఈ రసాయనాలు దండిగా ఉన్నాయని వారి పరిశోధనల్లో తేలింది.
కొన్ని రకాలైన ప్యాకేజీ మెటీరియల్స్‌ను ఈ రసాయనాలను ఉపయోగించి తయారు చేయడమే వల్ల రసాయనాలు ఆహారపదార్థాల్లోకి రావడమే కాకుండా కలుషిత నీటి ద్వారా, పరిసరాల కలుషిత వాతావరణం ద్వారా ఈ రసాయనాలు ఆహార పదార్థాల్లోకి చేరుతున్నాయట. జంక్ ఆహార పదార్థాలు, వాటి ప్యాకింగ్‌లపై అధ్యయనం జరపడంతోపాటు ఇంటి వంటకాలు, బయటి వంటకాలు తింటున్న దాదాపు పదివేల మంది అమెరికన్ల వైద్య రికార్డులు పరిశీలించి రసాయనాల గురించి నిర్ధారణకు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.